మహబూబాబాద్ జిల్లా బేతోల్‌లో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకోకు దిగారు. గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదాన్ని ఆసరాగా తీసుకుని ఎంపీ కవిత తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తూ ఈ ఆందోళనకు చేపట్టారు.
బాధితురాలు, ఎడబోయిన భుజంగరావు భార్య మాట్లాడుతూ… తన భర్త భుజంగరావుకు, ఎంపీ కవిత అనుచరుడైన సత్యనారాయణకు మధ్య గొడవలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ఎంపీ కవిత వద్దకు తాము వెళ్లామన్నారు.
కానీ ఎంపీ కవిత తన అరుచరుడైన సత్యనారాయణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆమె ఆరోపించారు. కుటుంబ తగాదాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
పోలీసులు సైతం రాజకీయ నాయకుల అండదండలు ఉన్న వ్యక్తులకు మాత్రమే వత్తాసు పలుకుతున్నారని ఆమె అన్నారు. తమల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన భర్త గత మూడు రోజులుగా కనిపించడం లేదన్నారు. ఆయన్ని వెంటనే ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.