ఓ దొంగ చోరీ చేసి పారిపోతూ బావిలో పడ్డాడు. కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయింది. దొంగతనం చేసి పారిపోదామనుకున్నవాడు.. పోలీస్ స్టేషన్ లో కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలోని హసన్ పర్తి మండలంలో చోటు చేసుకుంది. అనంతసాగర్ లోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలోని బాలికల వసతి గృహంలో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు.
వసతి గృహంలోని సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ దొంగలించి పారిపోతుండగా.. పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. రాత్రి సమయం కావడంతో అందులో నుంచి బయటపడే దారి కనిపించక పోవడంతో బావిలోనే ఉండిపోయాడు. ఉదయం అవ్వగానే దొంగ పెద్ద కేకలు, అరుపులు చేస్తూ ఉన్నాడు. అటువైపు వెళ్తున్న స్థానికులు ఆ అరుపులను విని పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే బావి వద్దకు చేరుకున్న పోలీసులు.. అతనిని బయటకు తీశారు. ఆ దొంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే కాలేజీలో చాలాసార్లు దొంగతనం జరిగినా యాజమాన్యం పట్టించుటకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు భద్రత కల్పించాలంటూ కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. మూడు రోజుల వ్యవధిలో 14 ఫోన్స్ అపహరణకు గురయ్యాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.