అదృష్టం అడ్డం తిరిగితే అరిటి పన్ను తిన్నా పన్ను ఇరుగుతోందనేది పెద్దలు చెప్పిన సామెత. కొన్ని సందర్భాల్లో పెద్దలు చెప్పిన సామెతలన్నీ నిజమే అనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా సరిపోయే ఓ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
ఆలయంలో చోరీకి వెళ్లిన ఓ దొంగ కిటికీ రంధ్రంలో ఇరుక్కుపోయి అడ్డంగా బుక్ అయ్యాడు. ముందుకు రాలేక, వెనక్కిపోలేక దిక్కుతోచని స్థితిలో స్థానికులకు పట్టుబడ్డాడు.తెల్లవారు జామున గుడిలో పూజలు చేసేందుకు పూజారి వచ్చే వరకు ఆ రంద్రంలోనే చిక్కుకొని ఉన్నాడు.
జిల్లాలోని కంచిలి మండలం జాడుపూడిలో జామి ఎల్లమ్మ తల్లి దేవాలయం ఉంది. పాపారావు అనే వ్యక్తి ఆలయంలోకి చొరబడి చోరీ చేయాలనుకున్నాడు. అనుకున్నదే పనిగా గుడిలోకి వెళ్లాడు. దొంగిలించిన సొత్తుతో బయటికి వచ్చేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా.. కిటికీ కన్నంలో దూరాడు.
Advertisements
కన్నం చిన్నగా ఉండటంతో నడుం భాగం అందులో పట్టక ఇరుక్కుపోయాడు. అతన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.