రాజస్థాన్ లో ఘోర ప్రమాదమే తప్పింది. ఓ ఆసుపత్రి వెనుక ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ పైపులైన్ ను దొంగలు కట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. వెంటనే వార్డులో ఉన్న 20 మంది నవజాత శిశువులకు సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ ను అందించారు. దీంతో ఎవరికీ ప్రాణాపాయం లేదు.
అల్వార్ నగరంలోని గీతానంద్ శిశు ఆస్పత్రిలో ఎఫ్‌బీఎన్‌సీ వార్డులో 20 మంది నవజాత శిశువులు ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారు. అయితే ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్లాంట్ పైపులను దొంగలించేందుకు యత్నించారు.
అందులో భాగంగా ఆక్సిజన్ పైపులను కట్ చేశారు. దీంతో ఎఫ్‌బీఎన్‌సీ వార్డుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడం వల్ల ఆస్పత్రిలో కలకలం రేగింది. అది గమనించిన దొంగలు పరారయ్యారు. దొంగలను చూసిన ఆస్పత్రి గార్డు గట్టిగా అదిచారు. చిన్నారుల కుటుంబసభ్యులు, స్థానికులు.. పరిగెత్తి దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇంజినీర్లను పిలిపించి రాత్రికి రాత్రే పైపు లైన్ కు మరమ్మతులు చేయించారు. ఆక్సిజన్ సరఫరా సాఫీగా సాగేటట్లు చర్యలు చేపట్టారు.ఇంతకు మునుపు కూడా ఈ ఆస్పత్రిలో అనేక సార్లు దొంగతనాలు జరిగాయని సిబ్బంది తెలిపారు. విద్యుత్ వైర్లు, పైపులైన్లు, మోటర్లు ఇతర వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పారు. పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.