ఇప్పుడు చెప్పబోయే దొంగలు మాములు వాళ్లు కాదు. పెద్ద ఘరానా దొంగలు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం చేశారు. అయితే వీళ్లు చేసింది మాములు జేబు దొంగతనం అయితే ఇంత ప్రత్యేకంగా చెప్పుకునే వాళ్లం కాదు.
వాళ్లు ఎత్తుకు వెళ్లింది ఓ బ్రిడ్జిని.. అదీ అందరూ చూస్తుండగానే. అందుకే ఇప్పుడు ఆ దొంగలు హెడ్ లైన్స్ లోకి ఎక్కారు. బ్రిడ్జిని దొంగతనం చేయడం ఏంటీ… అదీ అందరూ చూస్తుండగానే. అదేలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఈ వార్త చదవండి..
బిహార్ రాష్ట్రం రోహతాస్ జిల్లాలోని అమియావార్ గ్రామంలో ఒక ఇనుప బ్రిడ్జి ఉంది. వారం క్రితం కొంత మంది తమను తాము నీటిపారుదల శాఖ అధికారులుగా చెప్పుకుంటూ ఆ గ్రామానికి వచ్చారు.
వారితో పాటు కొందరు పనివారిని, గ్యాస్ కట్టర్స్, లారీలను తీసుకుని వచ్చారు. గ్రామంలోని బ్రిడ్జిని తొలగించే పనులు మొదలు పెట్టారు. ఈ విషయం గమనించి వారిని ఆ గ్రామస్తులు నిలదీశారు. అనుమానం వచ్చి అధికారులకు సైతం గ్రామస్తులు సమాచారం అందించారు.
తాము ప్రభుత్వ ఉద్యోగులమని, ఇక్కడ పాత బ్రిడ్జిని తొలగించి కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు తమను ప్రభుత్వం తమను ఇక్కడకు పంపిందని అందరినీ నమ్మించారు. దీంతో గ్రామస్తులు, అధికారులు సైతం ఆ పనిలో తమ వంతు సహాయం చేశారు.
దీంతో 60 ఫీట్ల పొడవు, 12 ఫీట్ల ఎత్తు ఉన్న ఇనుప వంతెనను వాళ్లు మూడు రోజుల్లో తొలగించారు. దాన్ని తమతో తెచ్చుకున్న లారీల్లో వేసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత విషయం అసలు విషయం తెలియడంతో అందరూ ఖంగుతిన్నారు.