రోజూలాగే ఆ జ్యుయలరీ షాప్ యజమాని దుకాణం మూసి ఇంటికి పోయి హాయిగా పడుకున్నాడు. డ్రైనేజ్ ద్వారా కన్నం పెట్టుకుని లోపలికి వస్తాడని కలగన్నాడా తెల్లారే సరికి అంతా తారుమారయ్యింది. దొరికినకాడికి దొరికినంత దోచుకుపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సినిమా మాదిరి దోపిడీకి తెగబడ్డారు దొంగలు. ఓ దుకాణంలో డ్రెయినేజీలోంచి 10 అడుగుల సొరంగం తవ్వి లక్షల రూపాయల విలువైన నగలను దొంగలు అపహరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దొంగలు దుకాణంలోకి ప్రవేశించడానికి డ్రైనేజీ నిర్మాణాన్ని కూల్చివేస్తూ సొరంగం తవ్వకున్నారు. ఆ సొరంగం గుండా నేరుగా దుకాణంలోకి ప్రవేశించారు. లక్షలాది రూపాయల నగలు సర్దుకుని దొంగలు పారిపోయారని పోలీసులు నిర్ధారించారు.
అయితే, చోరీకి గురైన సొత్తు మొత్తం ఎంత అనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన దోపిడీ వార్త రాష్ట్రవ్యాప్తంగా విస్తరించటంతో మీరట్ బులియన్ ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు.
నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని నిరసిస్తూ భారీగా షోరూమ్ వద్దకు చేరుకున్నారు. నగరంలో ఇలాంటి దోపిడీ ఘటన ఇది నాలుగోసారి అంటూ వ్యాపారులు ఆరోపించారు.
దోపిడీ జరిగిందనే సమాచారం మేరకు ఇద్దరు పోలీసు అధికారులు షోరూమ్‌కు చేరుకున్నారు. కాగా, వ్యాపారులు పోలీసులు దుకాణంలోకి ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు జరిగిన దోపిడీ సహా, ఇటీవల జరిగిన పలు దొంగతనం కేసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో చెప్పాలన్నారు.
చోరీ ఘటనలు విచారించడానికి సీనియర్ అధికారి హాజరు కావాలంటూ వ్యాపారులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, సుమారు రూ.10 నుంచి రూ.15 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు షాపు యజమాని పీయూష్ గార్గ్ తెలిపారు. చోరీలను చేధించి, దొంగలను పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.