ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్య చేసిన ఓ బృహత్తర యత్నం బెడిసికొట్టింది. 2024ఎన్నికలకు ముందు తృతీయ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి లోగడ పేరు మోసిన విపక్ష నేతలు చేసిన యత్నాలు నీరు గారినట్టే ఈ సారి కేజ్రీవాల్ కి కూడా అదే అనుభవం ఎదురైంది. బీజేపీయేతర, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులను కలుపుకుని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆయన కలలు కల్లలే అయ్యాయి.
తన యోచనలో భాగంగా ఆయన ఏడుగురు ముఖ్యమంత్రులకు గత ఫిబ్రవరి 5 న లేఖలు రాశారని తెలుస్తోంది. మూడో ఫ్రంట్ ఏర్పాటు విషయంలో ఓ నిర్ణయం తీసుకోవడానికి మార్చి 18 న మనమంతా ఢిల్లీలో ఒకచోట చేరి డిన్నర్ మీటింగ్ నిర్వహించుకుందామని, దీనికి మీరంతా హాజరు కావాలని ఆయన ఈ లేఖల్లో కోరారు. కానీ ఈ మీటింగ్ జరగనేలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొనేందుకు ‘ప్రోగ్రెసివ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్’ పేరిట మనం ‘ఉద్యమిద్దామని’ ఆయన ప్రతిపాదించారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులకు కేజ్రీవాల్ నుంచి ఈ లేఖలు వెళ్లాయి. కానీ వీరి నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉందట. తన ఆరోగ్యం బాగులేని కారణంగా తాను ఈ సమావేశానికి హాజరు కాలేనని కేసీఆర్ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది.
నిజానికి నాన్-బీజేపీ, నాన్-కాంగ్రెస్ పార్టీల కూటమి ఏర్పాటు కోసం మొదట కేసీఆర్ యత్నించారు. కానీ ఇతర పార్టీల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఆయన తన బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో వ్యాప్తి చెందింపజేసే సన్నాహాల్లో ఉన్నారు. తమకు కేజ్రీవాల్ నుంచి లేఖలు అందిన మాట నిజమేనని బీహార్, బెంగాల్ ప్రభుత్వాలు ధృవీకరించాయి. రెండో సారి బీజేపీకి దూరమైన బీహార్ సీఎం నితీష్ కుమార్.. 2024 ఎన్నికల్లో తాను ప్రధాన మంత్రి అభ్యర్థిని కాబోనని తప్పుకున్నారు. ఇక కాంగ్రెస్ లేకుండా 2024 ఎన్నికలకు తాము సమిష్ఠిగా కృషి చేయాలని బెంగాల్ సీఎం మమత, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇద్దరూ రెండు రోజుల క్రితమే ఓ అవగాహనకు వచ్చారు. ఇది మీరు ఫ్రంట్ అనండి .. లేదా పొత్తు అనండి ..ఏదైనా అనుకోండి అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించడం విశేషం.