శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సీఐఎస్ఎఫ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే ఇప్పుడు సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ భార్య ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగుతోంది.
ఛత్తీస్ గఢ్ కు చెందిన కానిస్టేబుల్ చింతామణి మొన్న ఆత్యహత్య చేసుకున్నారు. 20 ఏళ్ల చింతామణి 2021 లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. శిక్షణానంతరం శ్రీహరికోటలోని యూనిట్ లో విధులు నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవులపై సొంతూరుకు వెళ్లి ఈ నెల 10 న తిరిగి వచ్చిన చింతామణి..మొన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మొన్న సాయంత్రం షార్ మొదటి గేటు వద్ద కంట్రోల్ రూమ్ లో విధుల్లో ఉన్న బీహార్ కు చెందిన సబ్ ఇన్ స్పెక్టర్ వికాస్ సింగ్.. గన్ తో తలపై కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇతనికి భార్య,ముగ్గురు పిల్లలున్నారు.
అయితే ఇవాళ తెల్లవారే సరికి మరో మరణ వార్త వినాల్సి వచ్చింది. ఆత్మహత్యకు పాల్పడిన సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ వికాస్ సింగ్ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త వికాస్ సింగ్ ఆత్మహత్యతో నిన్న బీహార్ నుంచి భర్తను చూడడానికి చ్చిన ఆమె.. మనస్థాపానికి గురయ్యారు. రాత్రి నర్మదా గెస్ట్ హౌస్ లో బస చేసిన ఆమె.. ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
తెల్లవారే సరికి శవమై కనిపించింది. నర్మద గెస్ట్ హౌస్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న తుపాకీతో కాల్చుకొని వికాస్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మృతి విషయం తెలుసుకొని నిన్న తన అన్నతో కలిసి శ్రీహరి కోటకు వచ్చారు. భర్త వికాస్ సింగ్ మృతిని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వికాస్ సింగ్ కు భార్య,కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ఇప్పుడు ఆ చిన్నారులకు తల్లిదండ్రులు లేకుండా పోయారు. కుమారుడు ఒకటో తరగతి, కుమార్తె ఎల్ కేజీ, మరో కుమార్తె చిన్నపాప. ఇందులో ఓ కుమార్తె వికలాంగురాలిగా చెబుతున్నారు.
వికాస్ సింగ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతోన్న సమయంలో..ఆయన భార్య కూడా షార్ లోనే ప్రాణాలు తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది.