ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతోంది. నాటి నుంచి ఉక్రెయిన్‌వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. చాలామంది పొరుగుదేశాలకు పారిపోయారు. మరికొందరు వారి ఇళ్లను కోల్పొయి అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, సబ్ వే స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. అంతేకాదు, తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో కూడా చాలామందికి తెలియదని దుస్థితి నెలకొంది.
రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లోని చాలా నగరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఖార్కివ్ నగరంలో ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో నిర్వాసితులుగా మారిన వందలాదిమంది ప్రజలు ఖార్కివ్‌లోని సబ్వే స్టేషన్లో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు రెండు నెలలుగా చాలా మంది అక్కడి నుంచి బయటే రావటం లేదు. పలువురు అక్కడే ల్యాప్‌టాప్‌ల్లో పనిచేసుకోవడం, పడుకోవడం, చదువుకోవడంతో కాలం వెళ్లదీస్తున్నారు. వారందరికీ ఆహారం, నీళ్లు కూడా ఏర్పాటు చేశారు. వస్తువులు పెట్టుకోవడానికి అల్మారాలను కూడా ఏర్పాటు చేశారు అక్కడి అధికారులు.
అయితే, వారంతా సాధారణ జీవితాలను కోల్పోయి.. సబ్ వే స్టేషన్‌లోని జీవితానికి అలవాటు పడిపోయారు. ఈ క్రమంలో అలెక్స్ అనే ఓ 13 ఏళ్ల కుర్రాడు కూడా 70 రోజులుగా అక్కడే ఉంటున్నాడు. తన కుటుంబంతో కలిసి ఇక్కడకు వచ్చానని, సబ్ వే నే ఇప్పుడు తనకు ఇల్లు, పాఠశాల, ఆటస్థలం కూడా అని చెప్పుకొచ్చాడు.
“ఇది ఇప్పుడు నా ఇల్లు. రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే చదువుకుంటున్నాను. నేను భయపడను.” అని చెప్పాడు. అలెక్స్ రోజు ఆన్లైన్ తరగతులకు అటెండ్ అవుతాడని తల్లీ ఐరీన్ వివరించింది. కొన్ని వస్తువుల కోసం ఐదు రోజుల క్రితం ఇంటికెళ్లానని అది శిథిలావస్థలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.