ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. ఇన్నింగ్ 132 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని ఆస్ట్రేలియా మీడియా జీర్ణించుకోలేకపోతోంది. ఆసీస్ టీమ్ పై దారుణంగా విమర్శలు చేస్తోంది. ఈ ఓటమిని అవమానకరమైన ఓటమిగా అభివర్ణిస్తోంది.
రెండో టెస్టుకు మార్పులతో బరిలోకి దిగాలని సూచించింది. స్పిన్ తో ఆసీస్ కు చుక్కలు చూపించిన అశ్విన్,రవీంద్ర జడేజాలపై ప్రశంసలు కురిపిస్తోంది అక్కడి మీడియా. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 91 పరుగులకే ఆలౌట్ కావడం పై నాగ్ పూర్ టెస్టులో పాట్ కమిన్స్ జట్టు అవమానానికి గురైంది అంటూ ఆస్ట్రేలియా బ్రాడ్ షీట్ రాసింది.
ప్రత్యర్థి జట్టు 400 పరుగులు చేసిన చోట ఆస్ట్రేలియా తడబడిందని..దీనికి పిచ్ ను నిందించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ట్రావిస్ హెడ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై తెలివితక్కువ పనిగా డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. ఇక మాజీ ఆసీస్ కెప్టెన్ మాట్లాడుతూ.. ఇది మచ్చగా మిగిలిపోతుందని, సిగ్గు పడాలి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ ప్రదర్శనతో ఆటగాళ్లు ఇబ్బందిపడతారని..అంత పేలవంగా ఉందని, ఆట ఇంత త్వరగా ముగుస్తుందని నమ్మడం కష్టం అని అన్నారు. మొదటి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకు ఆలౌట్ అయింది. భారత మొదటి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అయి 223 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా అశ్విన్ దెబ్బకు 91 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇండియా ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ తేడాతో గెలిచింది.