ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ లో పస లేదని, క్రూరమైన ఈ బడ్జెట్ దేశ ప్రజల ఆశలను వమ్ము చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. కొత్త పన్నుల విధానం కోసం ఎదురు చూసిన కొద్దిమంది కోసం తప్ప పన్నులను ఈ బడ్జెట్లో తగ్గించలేదని ఆయన విమర్శించారు. దేశప్రజల్లో చాలామందికి ఇది ‘ద్రోహం’ చేసిందన్నారు. ధనికులకు, పేదలకు మధ్య పెరుగుతున్న అసమానతలు, పేదల జీవితాలపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలేదని, తన బడ్జెట్లో నిర్మలా సీతారామన్.. నిరుద్యోగం గురించి గానీ, పేదరికం గురించి గానీ ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన అన్నారు.
తన స్పీచ్ లో ఆమె రెండు సార్లు ‘పూర్’ అన్న పదాన్ని ఉచ్చరించడమే ఏదో పెద్ద దయ చూపినట్టయిందని చిదంబరం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.
.’పరోక్ష పన్నులను తగ్గించలేదు.. క్రూరమైన, ఏ మాత్రం సహేతుకం కాని జీఎస్టీ రేట్లనూ తగ్గించలేదు.. పెట్రోల్, డీజిల్, సిమెంట్, ఎరువులు మొదలైనవాటి ధరల తగ్గింపు ప్రస్తావన అసలే లేదు.. రాష్ట్రాలతో పంచుకుంటున్న అనేక సర్ చార్జీలు, సెస్సుల తగ్గింపు ఊసే లేదు.’.అని ఆయన దుయ్యబట్టారు.
ఈ బడ్జెట్ వల్ల లాభపడింది ఎవరు ? పేదలు మాత్రం కారు, ఉద్యోగం కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కూడా కారు.. పన్ను చెల్లింపుదారుల్లో అత్యధిక శాతం మంది గానీ, గృహిణులు గానీ కానే కారని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. జనాభాలో ఒక శాతం మంది ఉన్న బిలియనీర్ల చేతుల్లో సంపద అంతా కేంద్రీకృతమైంది తప్ప సామాన్యుల చేతిలో కాదన్నారు.