ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని కార్యాలయంలో వీరిద్దరూ సుమారు 20 నిమిషాల పాటు సమావేశం అయ్యారు.
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ నేతలపై, బీజేపీని వ్యతిరేకిస్తున్న ఇతర నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను ఈ సందర్బంగా లేవనెత్తినట్టు ఎన్సీపీ అధినేత తెలిపారు.
‘ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై ఏ ప్రాతిపాదికన చర్యలు తీసుకున్నారు? ఇది అన్యాయం. రౌత్‌పై చర్యలు తీసుకునేలా కేంద్ర దర్యాప్తు సంస్థలను పురికొల్పడం ఏమిటి? అతను బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని ప్రకటనలు చేస్తున్నందుకేనా?‘ అని ప్రధాని మోడీని అడిగినట్టు శరద్ పవార్ వెల్లడించారు.
ఎన్సీపీ-కాంగ్రెస్- శివసేన సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు నెలకొన్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాబోయే ఎన్నికల్లోనూ తాము కలిసే పోటీ చేస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం స్థిరంగా ఉందన్నారు. రెండున్నరేండ్ల నుంచి తాను ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ వస్తున్నట్టు తెలిపారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆప్ పార్టీ నాయకుడి బందువుల, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సీజ్ చేసింది.