వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఏయే పార్టీల మధ్య ఉండబోతున్నాయనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో హీట్ పుట్టిస్తుంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వస్తున్న వార్తలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు ప్రసక్తే లేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు.
కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుందని చెప్పడమనేది 2023 లో అతిపెద్ద జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పోలవరం విషయంలో సీఎం కేసీఆర్ విశాల దృక్పథంతో పనిచేస్తారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.
పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాకూర్ ను తొలగించడం కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. దాంతో తమకు సంబంధం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్ తప్పుకున్నారు. ఆ పార్టీ అవగాహన సదస్సు జరిగిన తరువాత ఆయన టి కాంగ్రెస్ వాట్సప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. అందరికీ ధన్యవాదాలు అంటూ ఆఖరి మెసేజ్ పెట్టిన ఠాగూర్..ఆ తరువాత అన్ని గ్రూప్ ల నుంచి లెఫ్ట్ అయ్యారు.
ఇటీవల కాలంలో టి కాంగ్రెస్ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. మాణిక్కం టార్గెట్ గా సీనియర్లు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. వివాదాలు తీవ్రమవడంతో హైకమాండ్ దూతగా రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్… ఇటీవలే హైకమాండ్ కు రిపోర్ట్ ఇచ్చారు. ఆ తరువాత మాణిక్కంను తప్పిస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
ఈ నేపథ్యంలో మాణిక్కం ఠాగూర్ పార్టీ వాట్సాప్ గ్రూప్ ల నుంచి తప్పుకున్నారు. ఇక త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంచార్జ్ ని నియమిస్తారని తెలుస్తోంది. అయితే మాణిక్కంను తప్పుకోమన్నారా..లేక అందరూ తననే టార్గెట్ చేస్తుండటంతో ఆయనే వెళ్లిపోయారా.. మాణిక్కం ఎపిసోడ్ లో తెరవెనుక ఏం జరిగిందనేది హాట్ టాపిక్ గా మారింది.