ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసి కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ అనర్హత వేటుకు గురయ్యారు. ఆయనకు రెండేండ్ల జైలు శిక్ష నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్టు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
భారత రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని నిబంధనల ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోప్రజాప్రాతినిథ్య చట్టం-1951పై దేశ వ్యాప్తంగా ప్రధాన చర్చ జరుగుతోంది. జైలు శిక్షలు పడిన నేతల విషయంలో ఈ చట్టం ఏం చెబుతోంది.. ఇప్పటి వరకు ఇలా ఎవరైనా అనర్హతకు గురయ్యారా..! అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం (1951)లోని సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(ఇ) ప్రకారం… ఏదైనా కేసులో ఒక ప్రజాప్రతినిధి దోషిగా తేలి అతనికి కోర్టులో రెండేండ్లు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడితే చట్టసభ సభ్యులు తమ సభ్యత్వం కోల్పోతారని పేర్కొంటోంది.
వారికి కోర్టు విధించిన శిక్షా కాలంతో పాటు మరో ఆరేండ్ల పాటు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం వర్తిస్తుంది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయ స్థానాల్లో కూడా రాహుల్ గాంధీకి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఆయన ఎనిమిదేండ్ల పాటు ఎన్నికల్లో పోటీకి దూరం అవుతారు.
‘లిల్లీ థామస్ తీర్పు’లో కోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రజాప్రతినిధులపై రెండేళ్లు, అంతకు మించిన శిక్ష పడితే ఆటోమేటిగ్గా వారిపై అనర్హత వేటు పడుతుందని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. నేర నిర్ధారణను సస్పెండ్ చేస్తే అనర్హతను కూడా నిలుపుదల చేయాలని 2018లో లోక్ ప్రభారీ కేసులో ఓ అప్పీల్‌పై సుప్రీం తీర్పునిచ్చినట్టు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
గతంలో తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితపై 2017లో అనర్హత వేటు పడింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆమెకు నాలుగేండ్ల జైలు శిక్ష పడింది. ఈ క్రమంలో ఆమె ఎమ్మెల్యే పదవి అనర్హులుగా ప్రకటించబడి సీఎం పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్ట్ నిర్ధోషిగా ప్రకటించడంతో ఆమెకు అడ్డంకులు తొలగిపోయాయి.
ఇక బిహార్‌లో దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. దీంతో ఆయనకు ఐదేండ్ల జైలు శిక్ష పడింది. ఈ క్రమంలో 2013 సెప్టెంబర్‌లో ఆయనపై అనర్హత వేటు పడింది. లక్షద్వీప్ మాజీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ అనర్హత వేటును ఎదుర్కొన్నారు. హత్యాయత్నం కేసులో దోషిగా తేలడంతో ఆయనకు రెండేండ్లకు మించిన జైలు శిక్ష పడింది. దీంతో ఈ ఏడాది జనవరి 23న ఆయనపై అనర్హత వేటు పడింది.
విద్వేషాలను రెచ్చ గొట్టేలా ప్రసంగాలు చేశారంటూ రామ్‌పూర్ మాజీ ఎంపీ ఆజం ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన దోషిగా తేలడంతో కోర్టు ఆయనకు శిక్ష విధించింది. దీంతో 2019లో ఆయన డిస్ క్వాలిఫై అయ్యారు. వారితో పాటు కమల్ కిశోర్ భగత్ (జార్ఖండ్ ఎమ్మెల్యేగా), టీఎం సెల్వగణపతీ (తమిళనాడు ఎంపీగా), సురేష్ హల్వాంకర్ (మహారాష్ట్ర ఎమ్మెల్యేగా), బాబన్‌రావ్ ఘోలప్ (మహారాష్ట్ర ఎమ్మెల్యేగా), ఆశా రాణి (బిహార్ ఎంపీగా), జగదీష్ శర్మ (బిహార్ ఎంపీగా), ఎనోస్ ఎక్కా (జార్ఖండ్ ఎమ్మెల్యేగా), పప్పు కలానీ (మహారాష్ట్ర ఎమ్మెల్యే)గా వేర్వేరు నేరాల్లో దోషులుగా తేలి, జైలుశిక్షలు పడ్డాయి. దీంతో వారు అనర్హత వేటు ఎదుర్కొన్నారు.