– తెరపైకి మరోసారి మియాపూర్ భూముల అంశం
– తోట చంద్రశేఖర్ కు లబ్ది చేకూర్చారన్న రఘునందన్
– అందుకే.. ఆయన బీఆర్ఎస్ లో చేరారని ఆరోపణ
– భూ కుంభకోణంపై విచారణకు డిమాండ్
బీఆర్ఎస్ లో ఈమధ్యే కొందరు ఏపీ నేతలు చేరారు. అనూహ్యంగా కాపు నాయకుడు తోట చంద్రశేఖర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు కేసీఆర్. గత ఎన్నికల సమయంలో జనసేన తరఫున క్రియాశీలకంగా వ్యవహరించిన చంద్రశేఖర్.. బీఆర్ఎస్ లో చేరడంపై అనేక అనుమానాలున్నాయి. పీఆర్పీ సమయం నుంచి పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధాన్ని కాదనుకుని ఆయన కేసీఆర్ పంచన చేరడంపై ఈమధ్యే ప్రొఫెసర్ హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేవలం ఆస్తులు కాపాడుకునేందుకే ఆంధ్రా నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆరోపించారు ఆయన. ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు బీజేపీ కూడా అదే రాగం అందుకుంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
భూ దందా కోసమే ఆయనను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని విమర్శించారు రఘునందన్. మియాపూర్ భూములతో లాభపడిన చంద్రశేఖర్ ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శలు చేశారు. మియాపూర్ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 78లో 40 ఎకరాలపై లెక్కలు తేలాలని చెప్పారు.
వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. తోట చంద్రశేఖర్ భూములపై ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే ఈ భూకుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఆఫీసర్లంటే ప్రేమ ఎక్కువని.. బీఆర్ఎస్ అంటే బిహార్ రాష్ట్ర సమితి అని ఎద్దేవ చేశారు రఘునందన్.