జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రంగాన్ని సిద్దం చేసుకుంటున్న బీఆర్ఎస్, తెలంగాణ సరిహద్దులను దాటి మొదటి సారి అడుగు బయటేయబోతుంది. ఫిబ్రవరి 5 న మహారాష్ట్రంలోని నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించబోతుంది. జాతీయ రాజకీయాలను మరింతగా ఆకర్షించడమే ఈ సభ లక్ష్యంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఖమ్మం సభ సక్సెస్ కావడంతో ఇదే ఊపులో రాష్ట్రం వెలుపల ఇదే తరహాలో మరో సభను నిర్వహిస్తే పార్టీలో ఉత్సాహం పెరుగుతుందని నాయకత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 న మహారాష్ట్రంలోని నాందేడ్ లో బీఆరఎస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసేందుకు సిద్దమైంది. నాందేడ్ సభకు అవసరమైన ఏర్పాట్లపై గత మూడు రోజులుగా మహారాష్ట్రకు చెందిన కొందరు నేతలు ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు. ఈ మేరకు కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాందేడ్ లో జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ముందుగా ఈ నెల 29 న బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గారు. కాగా, మహారాష్ట్ర శాసన మండలికి ఎన్నికలు జరుగుతున్నాయి.మండలికి సంబంధించి.. రెండు పట్టభద్రుల, మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలోనే అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆ తరువాత ఫిబ్రవరి 2న ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే ఇవేవీ సభకు అడ్డు రాకూడదన్న కారణంతోనే బీఆర్ఎస్ సభకు ఫిబ్రవరి 5 న ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సభ షెడ్యూల్ విషయానికొస్తే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత,సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ ఛైర్మన్ జీవన్ నెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు జోగురామన్న, హస్మంత్ షిండే పరిశీలించారు. ముందుగా గురుద్వారా సందర్శన ఉంటుందని,ప్రత్యేక పూజల అనంతరం హింగోలి రోడ్డు ఎదురుగా ఉన్న గురుద్వారా సత్కంద్ బోర్డు మైదాన్ లో బీఆర్ఎస్ చేరికల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం నాందేడ్ సిటీ ప్రైడ్ హోటల్ లో మీడియాతో మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సభకు సంబంధించి అన్ని పర్మిషన్లు లభించడం విశేషం. ఇక కేసీఆర్ తో ఛత్రపతి సాహు మహరాజ్ మనవడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రంలోనూ తెలంగాణ పథకాలు అమలు చేయాలని ఆయన కేసీఆర్ ను కోరారు.