భారత క్రికెట్ చరిత్రలో ఏప్రిల్ 2 అనేది మరువలేని రోజు. 2011లో ఇదే రోజు టీం ఇండియా రెండోసారి ప్రపంచ కప్ అందుకున్న రోజు. టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని క్రికెట్ ప్రపంచం హీరోగా చూసిన రోజు ఇది. ఏప్రిల్ 2, 2011 న, ప్రపంచ కప్ విజయం కోసం భారతదేశం 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. కపిల్ దేవ్ తర్వాత ఎంఎస్ ధోని 2 వ భారత కెప్టెన్‌గా నిలిచాడు.
స్వదేశంలో ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. మార్చి 12 న నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే ఇండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా (క్వార్టర్ ఫైనల్‌లో) మరియు పాకిస్తాన్ (సెమీ-ఫైనల్‌లో) గట్టి ప్రత్యర్ధులు వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. 2011 ప్రపంచ కప్ సందర్భంగా టీం ఇండియా ఆటగాళ్ళు అందరూ మెరుగైన ప్రదర్శనలు చేసారు.
9 మ్యాచ్‌ల్లో 482 పరుగులతో భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ అత్యధిక స్కోరు సాధించగా, అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 బ్యాట్స్‌మెన్ల జాబితాలో నలుగురు టీం ఇండియా ఆటగాళ్లే ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో జహీర్ ఖాన్ అత్యధిక వికెట్లు -21 తీయగా… యువరాజ్ సింగ్ 15 వికెట్లు తీసాడు. 362 పరుగులు చేశాడు. ఈ టోర్నీ యువరాజ్ కి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ కూడా వచ్చింది.
ఆ టోర్నీలో టీం ఇండియా నుంచి నలుగురు ఆటగాళ్ళు హీరోలుగా మిగిలిపోయారు. గౌతం గంభీర్, ఎం ఎస్ ధోనీ ఇద్దరూ భారీ అర్ధ సెంచరీలు సాధించి టీం ఇండియా విజయానికి బాటలు వేసారు. ఒత్తిడిలో గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత ధోనీ ఆడిన ఇన్నింగ్స్ కూడా టీం ఇండియాకు మరువలేని విజయాన్ని అందించింది. ఇక సచిన్ టోర్నీలో అత్యధిక పరుగులు చేయగా… యువరాజ్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత క్యాన్సర్ ని జయించినా టీంలో నిలువలేకపోయాడు.