ఆచార్య సక్సెస్ అయితే కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యేవి. కానీ ఆచార్య సక్సెస్ కాలేదు. దీంతో ఈ వారం కూడా ఎప్పట్లానే కొన్ని సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇటు థియేటర్లతో పాటు.. అటు ఓటీటీలో కొన్ని స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే ప్రచారం కూడా మొదలైంది. ఆ సినిమాలేంటో చూద్దాం.
ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమా భళా తందనాన. మొన్ననే అర్జున ఫాల్గుణ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన శ్రీవిష్ణు, ఇప్పుడు భళా తందనాన సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇన్నాళ్లూ నటనకు ఆస్కారం ఉండే పాత్రలు చేసిన ఈ హీరో, ఈసారి మాత్రం యాక్టింగ్ తో పాటు కాస్త యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ ఎంచుకున్నాడు. తాజాగా ట్రయిలర్ కూడా రిలీజైంది. ఈ సినిమా తనకు మాస్ అప్పీల్ తెచ్చి పెడుతుందని ఆశపడుతున్నాడు శ్రీవిష్ణు.
భళా తందనానకు పోటీగా వస్తోంది జయమ్మ పంచాయితీ. స్టార్ యాంకర్ సుమ, ఈ సినిమాతో మరోసారి నటిగా మారింది. అప్పుడెప్పుడో 3 దశాబ్దాల కిందట వెండితెరపై కనిపించిన సుమ, మళ్లీ ఇన్నేళ్లకు జయమ్మ పంచాయితీతో మనముందుకొస్తోంది. ఉత్తరాంధ్రలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకు విజయ్ కుమార్ దర్శకుడు. మే 6న రాబోతున్న ఈ సినిమా కోసం ప్రచారాన్ని ఓ రేంజ్ లో చేస్తున్నారు.
ఇక సుమ, శ్రీవిష్ణు సినిమాలకు పోటీగా.. విశ్వక్ సేన్ కూడా రెడీ అయ్యాడు. ఇతడు నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా మే6న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు విశ్వక్. ఈ క్రమంలో వివాదాలు కూడా ఎదుర్కొంటున్నాడు. ఇవన్నీ తన సినిమాకు మైలేజీ తెచ్చిపెడతాయని భావిస్తున్నాడు ఈ హీరో.
ఇక ఓటీటీలో కీర్తిసురేష్ నటించిన చిన్న సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. అరుణ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సెల్వ రాఘవన్ ఓ కీలక పాత్ర పోషించాడు. పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసిన చిన్ని అనే యువతి.. రంగయ్యతో కలిసి ఏకంగా 24 హత్యలు ఎందుకు చేసిందనేది ఈ సినిమా స్టోరీ. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా 6వ తేదీన స్ట్రీమింగ్ కు వస్తోంది.