ఈవారం రెండు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఒకటి సూర్య నటించిన ఈటీ సినిమా కాగా, రెండోది ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా. వీటిలో సూర్య సినిమాపై ఓ మోస్తరు అంచనాలుండగా.. రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది.
ఈమధ్య వరుసగా ఓటీటీలోనే మెరిశాడు సూర్య. అతడు నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి ప్రజాదరణ పొందాయి కూడా. జైభీమ్ అయితే ఆస్కార్ బరిలో కూడా నిలిచి శభాష్ అనిపించుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు ఈటీ సినిమాతో థియేటర్లలోకి వస్తున్నాడు సూర్య. పూర్తి కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లకే కరెక్ట్ అంటున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకుడు. 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.
ఇక ఈటీ వచ్చిన 24 గంటల వ్యవథిలో థియేటర్లలోకి వస్తున్నాడు ప్రభాస్. రాధేశ్యామ్ సినిమా 11వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఓవర్సీస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది ఈ సినిమా. ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ భాగ్యశ్రీ ఇందులో నటించారు.
ఇక ఎప్పట్లానే ఈ వారం కూడా ఓటీటీలో చాలా హంగామా నడుస్తోంది. ధనుష్ హీరోగా నటించిన మారన్ సినిమా ఈ వీకెండ్ ఓటీటీలోకి వస్తోంది. 11వ తేదీన డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇందులో ధనుష్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ధనుష్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాతో పాటు క్లాప్, ఖిలాడీ, రౌడీ బాయ్స్ కూడా ఓటీటీలోకొస్తున్నాయి. ఆది పినిశెట్టి నటించిన స్పోర్ట్స్ డ్రామ్ క్లాప్. ఈ సినిమా నేరుగా సోనీ లివ్ లో మార్చి 11న స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆకాంక్ష సింగ్, నాజర్, ప్రకాష్ రాజ్ లాంటి నటులు ఇందులో నటించారు. ఇక రవితేజ నటించిన ఖిలాడీ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో, ఆశిష్ హీరోగా పరిచయమైన రౌడీ బాయ్స్ జీ 5లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.