ఈ వారం ట్రేడ్ భలే గమ్మత్తుగా ఉంది. సినిమా హిట్టయినా గట్టిగా పైకి చెప్పుకోలేని పరిస్థితిలో 2 సినిమాలున్నాయి. వాటిలో ఒకటి పొన్నియన్ సెల్వన్-1 కాగా.. రెండోది కృష్ణ వ్రిందా విహారి. ఈ రెండు తప్ప, మిగతా సినిమాలన్నీ క్లియర్ గా ఫ్లాప్ అయ్యాయి.
భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది పొన్నియన్ సెల్వన్-1. మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేశారు. తన పలుకుబడితో ఈ సినిమాకు భారీగా స్క్రీన్స్ దక్కేలా చేయగలిగారు. కానీ మొదటి రోజు మొదటి ఆటకే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. అయినప్పటికీ హైప్ కారణంగా, అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. ఆ తర్వాత ఫ్లాప్ అని తెలిసినప్పటికీ, మణిరత్నం సినిమా కావడంతో మల్టీప్లెక్స్ ఆడియన్స్ సినిమాను చూశారు.
దీంతో సినిమాకు డీసెంట్ వసూళ్లు వచ్చాయి. అలా అని ఆ వసూళ్లను పైకి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే, ఆ నంబర్ బయటకు చెబితే, బ్రేక్ ఈవెన్ అవ్వలేదని విషయం బయటకొస్తుంది కాబట్టి. అలా అటు హిట్ అని చెప్పుకోలేక, ఇటు ఫ్లాప్ అంటే ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమాను థియేటర్లలో నడిపిస్తున్నారు.
అటు కృష్ణా వ్రిందా విహారి సినిమాది కూడా ఇదే పరిస్థితి. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా క్లీన్ హిట్. అందరూ దీన్ని మెచ్చుకున్నారు. అయితే నాగశౌర్య క్రౌడ్ పుల్లర్ కాదు. అందుకే ఈ సినిమాకు స్టడీగా వసూళ్లు వస్తున్నాయి. రిలీజ్ తర్వాత రెండు వీకెండ్స్ చూసిన ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది. ఇక వచ్చే వారం గాడ్ ఫాదర్, ఘోస్ట్ రాకతో ఈ సినిమా దాదాపు క్లోజ్ అయినట్టే. సో.. తన సినిమా హిట్టని చెప్పుకుంటున్న నాగశౌర్యకు ఆ సంతోషం మాత్రమే మిగిలింది.
ఈ రెండు సినిమాలతో పాటు థియేటర్లలో కొనసాగుతున్న నేనే వస్తున్నా, లాట్స్ ఆఫ్ లవ్ లాంటి సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. అటు బ్రహ్మాస్త్ర మూవీ కూడా దాదాపు క్లోజింగ్ కు వచ్చేసింది.