సంక్రాంతి పండగ ముగిసింది. సంక్రాంతి సినిమాల జాతకాలు తేలిపోయాయి. గడిచిన శుక్రవారం సినిమాలేవీ రిలీజ్ అవ్వలేదు. దీంతో ఈ వారం కూడా సంక్రాంతి సినిమాల హవా నడిచింది. ప్రస్తుతం మార్కెట్లో వాల్తేరు వీరయ్య హవా నడుస్తోంది. సంక్రాంతి బరిలో హిట్టయిన సినిమా ఇదే. ప్రస్తుతం నడుస్తున్న సినిమా కూడా ఇదే. తాజా వసూళ్లతో ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాకు 2.25 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి.
వాల్తేరు వీరయ్య తర్వాత రెండో స్థానంలో ఉంది వీరసింహారెడ్డి. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ, ఆ తర్వాత చతికిలపడింది. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అనే విషయం ఈ వారంలో తేలిపోతుంది.
ఇక విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా కూడా థియేటర్లలో ఉంది. అయితే ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పెద్దగా లేదు. మల్టీప్లెక్సుల్లో మాత్రం అరకొరగా ఆడియన్స్ కనిపిస్తున్నారు. విజయ్ నటించిన ఈ స్ట్రయిట్ తెలుగు సినిమాకు దిల్ రాజు నిర్మాత.
ప్రస్తుతం మార్కెట్లో నలుగుతున్న సినిమాలు ఈ మూడే. వీటితో పాటు అవతార్-2, తెగింపు సినిమాలు కూడా థియేటర్లలో ఉన్నప్పటికీ, వాటికి వసూళ్లు పెద్దగా రావడం లేదు. ఈ వీకెండ్ సుధీర్ బాబు నటించిన హంట్ సినిమా వస్తోంది. అది క్లిక్ అయితే వీరసింహారెడ్డి, వారసుడు లాంటి సినిమాల రన్ ముగిసిపోతుంది.