ఆచార్యతో పెద్ద సినిమాల డ్రైవ్ ముగిసింది. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది తొలి 6 నెలలు పెద్ద సినిమాల హవా నడిచింది. ఇప్పుడు మిగిలిన 6 నెలల్లో దాదాపు చిన్న సినిమాలు, మీడియం రేంజ్ మూవీస్ మాత్రమే రాబోతున్నాయి. ఇందులో భాగంగా ఈ వీకెండ్ ఏకంగా అరడజను చిన్న చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వాటితో పాటు, ఈ వారాంతం ఓటీటీలోకి వస్తున్న సినిమాలేంటో చూద్దాం.
ఈ వీకెండ్ వస్తున్న సినిమాల్లో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ హ్యాపీ బర్త్ డే. గతంలో మత్తు వదలరా అనే సక్సెస్ ఫుల్ మూవీ తీసిన రితేష్ రానా ఈ సినిమాకు దర్శకుడు. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషించింది. సత్య, వెన్నెల కిశోర్ తో పాటు చాలామంది నటీనటులు ఇందులో కామెడీ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.
ఇక హ్యాపీ బర్త్ డే తర్వాత ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా మాయోన్. ఇది డబ్బింగ్ సినిమా. సత్యరాజ్ కొడుకు సిబి ఇందులో హీరో. కాస్త మైథలాజికల్ టచ్ తో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమాపై కూసింత అంచనాలున్నాయి. ప్రమోషన్ కూడా జోరుగా చేస్తున్నారు. వీటితో పాటు గంధర్వ, మా నాన్న నక్సలైట్, కొండవీడు, రుద్రసింహ లాంటి సినిమాలు వస్తున్నప్పటికీ వీటిపై ఎవ్వరికీ పెద్దగా అంచనాల్లేవ్.
అటు ఓటీటీలో ఈ వీకెండ్ అంటే సుందరానికి, విక్రమ్ సినిమాలు రాబోతున్నాయి. అంటే సుందరానికి సినిమా థియేటర్లలో కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాకు ఆదరణ దక్కే అవకాశం ఉంది. ఇక విక్రమ్ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయింది. డిస్నీ హాట్ స్టార్ లో 8వ తేదీన వచ్చే ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా మరోసారి వెయిటింగ్.