హైదరాబాద్ సరూర్‌నగర్ పరువు హత్య కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తన భర్తను చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని నాగరాజు భార్య ఆశ్రిన్ డిమాండ్ చేశారు. తొలివెలుగుతో మాట్లాడుతూ.. తన ఆవేదనను వ్యక్తం చేశారు. నాగరాజుతో పెళ్లి తన సోదరులకు ఇష్టం లేదని.. అందుకే నాగరాజును దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను చంపిన దూరం చేసిన పుట్టినింటికి బతికున్నంత కాలం వెళ్లబోనని ఆశ్రిన్ అంటున్నారు.
నాగరాజులో తండ్రి ప్రేమను పొందానని చెప్తూ కంటనీరు పెట్టుకున్నారు ఆశ్రిన్. తమ ప్రేమ విషయం అమ్మకి ముందుగానే చెప్పానని.. తాను కూడా నాగరాజుతో ఫోన్ లో మాట్లాడిందని తెలిపారు. అందుకు తన అన్నయ్య అమ్మను బాగా కొట్టాడని వెల్లడించారు ఆశ్రిన్.
తన కళ్ల ముందే తన భర్తను దారుణంగా హింసపెట్టి చంపిన తన అన్నను, బావను ఫాస్ట్రాక్ కోర్ట్ ద్వారా శిక్షించాలని కోరారు. తన కొడుకును దారుణంగా హత్య చేశారని నాగరాజు తల్లి అనుసుజ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోన్నారు. తన భర్తను చంపిన ప్లేస్ లోనే అన్నను నడిరోడ్డుపై ఉరితీయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సరూర్ నగర్ పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పథకం ప్రకారమే నాగరాజు హత్యను నిందితులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు.. నాగరాజు మొబైల్ లో స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసినట్లు తెలిపారు. నాగరాజు ప్రతి కదలికను మొబైల్ ద్వారా ట్రాక్ చేశారని పేర్కొన్నారు. నిందితులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్ తో నాగరాజును హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు.