తుర్కియే,సిరియా దేశాల్లో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు తనను తీవ్రంగా కలిచివేశాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక వరుస భూకంపాలు ఈ రెండు దేశాలను వణికిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘనటల్లో 5 వేలకు పైగా మంది మృత్యువాత పడ్డారు. ఈ భూకంపాలపై ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి.
ప్రకృతి ప్రకోపానికి గురైన ఆ రెండు దేశాలకు తమకు తోచిన సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. అయితే ఒక్క తుర్కియేలోనే 3 వేల మందికి పైగా మరణించగా.. సిరియాలో దాదాపు 1500 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. వేలాది మంది శిథిలాల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈ భూకంపంలో మృతుల సంఖ్య మరింత భారీగా పెరగొచ్చని డబ్ల్యూహెచ్వో తెలిపింది. 20 వేల మందికి పైగా మరణించి ఉంటారని అంచనా వేసింది.మరోవైపు భూకంపం ధాటికి కకావికలమైన తుర్కియే ,సిరియాపై ప్రపంచదేశాలు సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి. సాయం అందిస్తామనంటూ ముందుకు వచ్చి.. రెస్క్యూ బృందాలతో పాటు వైద్య సిబ్బందిని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపిస్తున్నాయి.
ఈ ప్రమాదంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్న మోడీ..తుర్కియేకు 100 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ లను పంపాలని ఆదేశించారు.