దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం జరిగి 14 ఏళ్ల అవుతోంది. ఈ సందర్భంగా ముంబై పేలుళ్ల ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఉగ్ర దాడులకు కుట్ర పన్నిన వారిని చట్టం ముందుకు తీసుకురాలని జైశంకర్ ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. ఉగ్రవాదం కారణంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాల్సిందే అని ఆయన తెలిపారు.
ఈ రోజు 26/11 సందర్భంగా భారత్ తో కలిసి యావత్ ప్రపంచం ఆ మారణ హోమం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా దాడులకు సంబంధించిన ఓ వీడియో జైశంకర్ షేర్ చేశారు. ఆ వీడియో చివర్లో మోడీ సందేశం కూడా ఉంది. ఉగ్రదాడి ఒక్కటైనా.. ఎన్నో జరిగినట్లే.. ఒక్క ప్రాణం పోయినా ఎన్నో ప్రాణాలను కోల్పోయినట్లే.. అని ఇటీవల ఓ వేదికపై మోడీ చెప్పిన సందేశాత్మక ఈ వీడియోని ఆయన ట్వీట్ కి జత చేశారు.
అయితే 26/11 దాడులు జరిగి 14 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్పు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ధైర్యంగా పోరాడి ఎంతో మంది భద్రతా సిబ్బంది ప్రాణ త్యాగం చేశారు. వారి త్యాగాలను దేశం స్మరించుకుంటోంది.. మృతులకు నివాళ్లు అర్పిస్తోంది. ఈ దాడుల్లో ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాము.. అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
కాగా ముంబైలో భీకర ఉగ్రదాడి జరిగి 14 ఏళ్లు సరిగ్గా అయ్యాయి. అమాయక ప్రజలపై పాకిస్థానీ ముష్కరులు బాంబు పేలుళ్లు జరిపి అనేక మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ మారణహోమం తాలూకా భయానక క్షణాలు ఇంకా కళ్లముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కానీ ఆ ఘోరానికి పాల్పడిన వారు మాత్రం శత్రుదేశంలో ఇంకా స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. వారికి ఎలాగైనా శిక్ష పడాలని యావత్ భారత దేశం కోరుకుంటోంది.