మొహాలీ పేలుడు ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పందించారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పంజాబ్ లో ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
అంతకు ముందు సీఎం తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘటన జరిగిన విధానాన్ని పోలీసులను అడిగి ఆయన తెలుసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు.
సీఎం భగవంత్ మాన్ ట్వీట్ ను ఆయన షేర్ చేస్తూ… ఇది పంజాబ్ లో శాంతికి భంగం కలిగించాలనకునే కొందరు చేసిన పిరికిపంద చర్య అని ఆయన అన్నారు. వారి ఆకాంక్షలను పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం నెరవేరనివ్వదన్నారు.
పంజాబ్ లోని అన్ని వర్గాల ప్రజల సహకారంతో రాష్ట్రంలో శాంతి నెలకొనేలా చేస్తామని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన వెల్లడించారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమన్నారు.
మొహాలీలోని పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం భవనంలో సోమవారం పేలుడు సంభవించింది. దీంతో భవనంలోని అద్దాలు, కిటికీలన్నీ పగిలిపోయాయి. ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన క్యార్యాలయ మూడవ అంతస్తును టార్గెట్ గా చేసుకుని రాకెట్ లాంచర్ దాడి జరిగినట్టు ఎస్పీ రవీంద్ర పాల్ సింగ్ తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.