చిల్లర రాజకీయాల కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. మంగళవారం ఎమ్మెల్యే రఘునందన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఆ ఆరోపణలను కొట్టి పారేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ఈ పనికిమాలిన ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలు నిజమైతే.. ఆ సర్వే నెంబర్ భూమిలో 90 శాతం ఆయన్నే తీసుకోమని, మిగిలిన 10 శాతాన్ని తనకు ఇవ్వాలన్నారు తోట. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతోందని.. తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నామన్న చంద్రశేఖర్.. త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రఘునందన్ తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. భూ దందా కోసమే ఆయనను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. మియాపూర్ భూములతో లాభపడిన చంద్రశేఖర్ ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శలు చేశారు.
మియాపూర్ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 78లో 40 ఎకరాలపై లెక్కలు తేలాలని చెప్పారు. వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. తోట చంద్రశేఖర్ భూములపై ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే ఈ భూకుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆరోపణలను ఖండించారు చంద్రశేఖర్.