బాల్య వివాహాల కట్టడికి కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. 14 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నేరమని పేర్కొన్నారు. ఆ వ్యక్తి బాలిక భర్తగా నిరూపించుకున్నప్పటికీ వారికి శిక్షలు తప్పవని పేర్కొన్నారు.
ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలను కటకటాల్లోకి నెట్టుతామని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… మహిళలు చట్టబద్ధంగా వివాహం చేసుకునే వయసు 18 ఏండ్లు అని తెలిపారు. మాతృత్వానికి సరైన వయస్సు ఉండాలన్నారు. లేదంటే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని ఆయన అన్నారు.
తక్కువ వయస్సు వున్న బాలికలను వివాహం చేసుకున్న భర్తలపై కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి కేసుల్లో భర్తలు జీవిత ఖైదు ఎదుర్కొంటారని ఆయన వెల్లడించారు. రాబోయే ఐదారు నెలల్లో వేలాది మంది భర్తలు అరెస్టు అవుతారని హెచ్చరించారు.
మాతృత్వానికి సరైన వయసు 22-30 ఏళ్లని ఆయన వెల్లడించారు. సరైన వయస్సులో మాతృత్వాన్ని స్వీకరించకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని అన్నారు. అందువల్ల సరైన సమయంలో వివాహం చేసుకోవాలని ఆయన సూచించారు.