బెంగళూరుకు సమీపంలోని కోలార్ అనే ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక వాడలో విస్ట్రాన్ అనే కంపెనీలో కాంట్రాక్టు కార్మికులు తాజాగా విధ్వంసం సృష్టించిన విషయం విదితమే. అయితే అందులో కార్మికులు పాల్పడిన విధ్వంసక చర్యల వల్ల ఆ కంపెనీకి దాదాపుగా రూ.440 కోట్ల వరకు నష్టం వచ్చిందని అంచనా వేశారు. ఈ మేరకు ఆ కంపెనీ ఆ రాష్ట్ర కార్మిక విభాగానికి, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నష్టం వివరాలను పేర్కొంది.
కాగా విస్ట్రాన్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారు తాజాగా కంపెనీలో 2 గంటల పాటు విధ్వంసం సృష్టించారు. కంపెనీ కిటికీల అద్దాలను, ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. తమకు కంపెనీ సరిగ్గా జీతాలు చెల్లించడం లేదని, అన్ని బెనిఫిట్స్ ను నెల నెలా సరిగ్గా కట్ చేస్తున్నారని, కానీ వేతనాలు అందడం లేదని ఆరోపిస్తూ వారు ఫ్యాక్టరీలో దాడులు చేశారు. ఈ ఘటనలో వేలకొద్దీ ఐఫోన్లను దొంగిలించారు. దీంతోనే భారీ నష్టం సంభవించింది.
కాగా ఇదే విషయమై కర్ణాటక కార్మిక శాఖ మంత్రి శివరాం హెబ్బార్ స్పందించారు. ఫ్యాక్టరీపై జరిగిన దాడిని ఖండించారు. ఆ దాడులను ఏమాత్రం సహించేది లేదన్నారు. అయితే విస్ట్రాన్ కంపెనీలో 1200 మంది పర్మినెంట్ కార్మికులు పనిచేస్తున్నారని, మరో 8,900 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి గాను 6 కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చారని మంత్రి తెలిపారు. అయితే విస్ట్రాన్ కంపెనీ సదరు కంపెనీలకు కార్మికుల వేతనాలను నెలనెలా చెల్లిస్తుందని, కానీ ఆ కంపెనీలు కాంట్రాక్టు కార్మికులకు జీతాలను ఇవ్వడం లేదని నిర్దారణ అయిందన్నారు. ఇదే విషయమై కార్మికులు విస్ట్రాన్‌పై దాడి చేసి ఉంటారని అన్నారు.
అయితే కార్మిక విభాగం విస్ట్రాన్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసిందని, మూడు రోజుల్లోగా కార్మికులకు రావల్సిన బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని చెప్పారని మంత్రి తెలిపారు.