ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ఎన్ని విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తున్నా.. హ్యాకర్ల బెడద మాత్రం తొలగిపోవడం లేదు. ఎప్పుడు చూసినా హ్యాకర్లు ఫలానా సంస్థకు చెందిన సర్వర్లను హ్యాక్ చేశారనో.. లేదా ఇంకేదైనా చేశారనో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా హ్యాకర్లు మరోమారు విజృంభించారు. ఏకంగా అమెరికాలోని అనేక కంపెనీలు, హాస్పిటల్స్, ఇతర కార్యాలయాల్లో అమర్చిన వేలాది సీసీకెమెరాలను హ్యాక్ చేశారు. ముఖ్యంగా వెర్కాడా కంపెనీ భారీ ఎత్తున హ్యాకింగ్‌కు గురైంది.
అమెరికాకు చెందిన వెర్కాడా కంపెనీ 2016లో ఏర్పాటైంది. సెక్యూరిటీ కెమెరాలను ఆ కంపెనీ విక్రయిస్తుంది. ఈ క్రమంలోనే ఆ కంపెనీ జనవరి 2020లో 80 మిలియన్ డాలర్లను వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ ద్వారా సమకూర్చుకుంది. దీంతో ఆ కంపెనీ విలువ అప్పట్లోనే 1.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే నిజానికి ఈ కంపెనీ ఒక స్టార్టప్ కంపెనీ. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఈ కంపెనీ టెస్లా, క్లౌడ్ ఫ్లేర్ వంటి ప్రముఖ సంస్థలతోపాటు అనేక హాస్పిటల్స్, కార్యాలయాలు, ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు, జైళ్లకు సెక్యూరిటీ కెమెరాలను విక్రయించింది. దీంతో వారందరూ ఈ కంపెనీ వినియోగదారులుగా ఉన్నారు.
అయితే తాజాగా ఆ వినియోగదారులందరి సెక్యూరిటీ కెమెరాలను ఓ అంతర్జాతీయ హ్యాకర్ గ్రూప్ హ్యాక్ చేసింది. సదరు కెమెరాలకు చెందిన లైవ్ ఫీడ్‌ను హ్యాకర్లు యాక్సెస్ చేయగలిగారు. అలాగే పెద్ద మొత్తంలో ఫుటేజ్ ను కూడా వారు చోరీ చేశారు. వెర్కాడా కంపెనీకి చెందిన సూపర్ అడ్మిన్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను ఇంటర్నెట్‌లో సంగ్రహించడం ద్వారా ఆ హ్యాకర్లు హ్యాకింగ్‌కు పాల్పడ్డట్లు గుర్తించారు.
అయితే విషయం తెలుసుకున్న వెర్కాడా స్పందించింది. హ్యాకర్లకు తమ కెమెరాలకు చెందిన ఫీడ్, అకౌంట్లు అందకుండా నిలుపుదల చేసింది. అలాగే తన కస్టమర్లకు కూడా హెచ్చరికలు చేసింది. దీంతో అందరూ అలర్ట్ అయ్యారు. దీంతోపాటు పోలీసులకు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేశామని వెర్కాడా తెలిపింది. ఈ క్రమంలో ఆ హ్యాకర్లు ఎవరు ? అని అందరూ గుర్తించే పనిలో పడ్డారు. కాగా వెర్కాడా లాంటి భారీ స్టార్టప్‌కు చెందిన సెక్యూరిటీ కెమెరాలు ఇంత పెద్ద ఎత్తున హ్యాకింగ్‌కు గురి కావడం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.