తమిళనాడులో రూ.500కోట్ల విలువ చేసే ఓ శివలింగం వెలుగు చూసింది. దీన్ని తమిళనాడు ఐడల్స్ స్మగ్లింగ్ నిరోధక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తంజావూరులోని అరుళనందనగర్ లో ఎన్ఎస్ అరుణ్‌ను అనే బిజినెస్ మ్యాన్ ఇంట్లో విలువైన శివలింగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. కానీ.. ఎలాంటి శివలింగాలు ఆయన ఇంట్లో దొరకలేదు. తన తండ్రి బ్యాంక్ లాకర్ లో ఓ శివలింగాన్ని దాచినట్టు అరుణ్ తెలిపారు. దీంతో, బ్యాంకు లాకర్ లోని మరకత శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లాకర్ లో ఉన్న శివలింగానికి ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ విగ్రహం తన తండ్రికి ఎలా వచ్చిందో తనకు తెలియదని అరుణ్ తెలిపాడు. సుమారు 530 గ్రాముల బరువు, 8 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న దీని విలువ రూ. 500 కోట్లు ఉంటుందని జెమాలజిస్టులు చెప్పారు.
ఈ విగ్రహాన్ని పోలీసులు ఐడల్స్ స్మగ్లింగ్ నిరోధక అధికారులకు అందించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విగ్రహం చోళుల కాలం నాటిదని.. వెయ్యి ఏళ్లు క్రితం నాటిదని ఐడల్స్ స్మగ్లింగ్ నిరోధక అధికారులు చెబుతున్నారు. 2016లో నాగపట్టణంలోని తిరుకువలై శివాలయంలో ఓ శివలింగం దొంగతనానికి గురైంది. ఇది అదేనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.