అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని కూల్చేస్తామంటూ ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఆలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆలయం చుట్టూ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు.
గురువారం ప్రయోగ్ రాజ్ కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తికి అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తామంటూ ఫోన్ చేశారు. అప్రమత్తమైన స్థానిక వ్యక్తి.. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా రామ మందిరం పేల్చివేతకు ఉగ్రవాదులు కుట్రలు పట్టినట్లు గత నెలలో కూడా భారత నిఘా వర్గాలు గుర్తించాయి. నిఘా వర్గాల హెచ్చరికల తరువాత అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టారు. అయోధ్య రామమందిరం వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదిన ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ క్రమంలోనే రామ మందిరంపై ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నారని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. అయోధ్య రామమందిరంపై ఉగ్రవాదులు రెక్కీ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆయోధ్య రామమందిరం వద్ద భద్రతను మరింత పెంచారు.