ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయనకు చెందిన హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిని పేల్చివేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. ముఖేశ్ అంబానీతో పాటు ఆయన భార్య నీతా అంబానీ, కుమారులు అకాశ్, అనంత్ అంబానీలను హతమారుస్తామని కాలర్ హెచ్చరించాడు.
మొత్తం రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొదట బుధవారం మధ్యాహ్నం 12.45 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ తర్వాత బుధవారం సాయంత్రం 5.04 గంటలకు మరోసారి రిలయన్స్ ఆస్పత్రి కాల్ సెంటర్‌కు ఫోన్ కాల్స్ వచ్చాయి.
ఈ కాల్స్ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబై పోలీసులు బుధవారమే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. వెంటనే నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
రిలయన్స్ ఆస్పత్రి ల్యాండ్ లైన్ కు నిందితుడు చేసిన చేసిన కాల్ ఆధారంగా నంబర్ ను పోలీసులు గుర్తించారు. నంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు బిహార్ లో ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని ముంబైకి బయలు దేరారు.