ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సిని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. మెస్సి భార్య తరపున కుటుంబ సభ్యులకు చెందిన ఓ సూపర్ మార్కెట్ పై గుర్తు తెలియని వ్యక్తులు. గురువారం అర్థరాత్రి వేళ కాల్పులు జరిపారు. సుమారు 14 రౌండ్ల బుల్లెట్లు పేల్చినట్లు తెలుస్తోంది. అనంతరం ‘వెయిటింగ్ ఫర్ యూ’ అని నేలపై రాసి మరీ వెళ్లారు.
అర్జెంటీనాలోని మెస్సి స్వస్థలం రోసారియో నగరంలో ఈ ఘటన జరిగింది. మొత్తం ఘటనను మేయర్ జావ్కిన్ ధ్రువీకరించారు. అయితే స్థానికంగా గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా ఈ ఘటనకు దుండగులు పాల్పడినట్లు భావిస్తున్నామని జావ్కిన్ తెలిపారు.
మెస్సిపై దాడి కంటే ప్రపంచంలో ఏ స్టోరీ వేగంగా వైరల్ కాగలదని వ్యాఖ్యానించారు. ఇదంతా కొంతకాలంగా జరుగుతోందని చెప్పారు. పోలీసులు సైతం.. ఇది ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నమేనని వెల్లడించారు.
ఇకపోతే గతేడాది డిసెంబర్ లో ఖతార్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జట్టుకు మెస్సియే కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఆ అపురూప విజయానికి గుర్తుగా తన అర్జెంటీనా జట్టు సభ్యులకు, సిబ్బందికి రూ.1.72 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన గోల్డ్ ఐఫోన్ లు గిఫ్ట్ లుగా ఇచ్చాడు.