రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ఇటీవల భారీవర్షాలతో ముప్పు ఎదురవుతోంది.
వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి ఆలయం చుట్టూ చేరుతోంది. వరద నీరు డ్రైనేజీలోకి వెళ్లేలా అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే వర్షపు నీరు నిలిచిపోతోంది. పురావస్తుశాఖ నిర్లక్ష్యంతో ప్రతి యేటా వర్షాకాలంలో ఏదో ఓ రూపంలో సమస్య తలెత్తుతోంది
ఇటీవల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామప్ప ఆలయం చుట్టూ భారీగా వరదనీరు చేరుకుంటోంది. ఆలయం చుట్టు డ్రైనేజీల్లో పూడిక మట్టి చేరింది. దేవాలయంలోని ఉపాలయాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వరద నీరు బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
2020లో కూడా భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఆలయం ఈశాన్య భాగంలో ఉన్న ప్రహరి గోడ కూలింది. దీనికి ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు. 2017లో ఆలయానికి వెళ్లేమార్గంలో, ప్రస్తుత పార్కింగ్ స్థలానికి సమీపంలో ఉన్న శివాలయం కూలిపోయింది.
నీరు లీకవుతున్న ప్రాంతాలను 2015లో గుర్తించారు. పైభాగంలోని ఒక పొరను అధికారులు పూర్తిగా తొలగించారు. కొత్తగా మళ్లీ శ్లాబ్ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2014లో గుడిలోని మరో 4చోట్ల వర్షానికి పై నుంచి నీరు కారడం ప్రారంభమైంది. దీంతో పురావస్తుశాఖ అధికారులు మరమ్మతులు చేశారు. నామమాత్రంగా పనులు చేయడంతో ఈ సమస్య మళ్లీ ఉత్పన్నమైంది. దీంతో ఇప్పటికైనా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా సరైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.