గత రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాలకు మంకీపాక్స్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్.. ప్రస్తుతం 30కిపైగా దేశాలకు వ్యాపించింది. ఇప్పటివరకూ 550 కేసులు ధ్రువీకరించగా.. అనుమానిత కేసులు కూడా వందల్లో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
మంకీపాక్స్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని తొలుత ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇప్పుడు చేతులెత్తేసింది. ఈ వైరస్ ను అదుపు చేయడం గురించి ఖచ్చితంగా చెప్పలేమని డబ్ల్యూహెచ్ఓ ఐరోపా విభాగం చీఫ్ డాక్టర్ హన్స్ క్లూగే పేర్కొన్నారు. ఈ వైరస్ నియంత్రణకు కోవిడ్ శైలి పరిమితుల స్థాయిని అనుకరించనప్పటికీ.. ముప్పును తగ్గించడానికి ఆరోగ్య అధికారులు అత్యవసర చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అయతే.. ఈ వైరస్ కు ఐరోపా అతిపెద్ద ఎపిక్ సెంటర్ గా మారింది. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని స్థానిక ప్రాంతాల వెలుపల వైరస్ వ్యాప్తి చెందిన దాఖలాల్లేవు. అయితే. గత రెండు వారాలుగా పలు దేశాలు ముఖ్యంగా యూరప్ లో వేగంగా సంక్రమిస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన క్లూగే.. ‘‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ పరిస్థితిని తక్షణమే పరిశోధించడానికి, నియంత్రించడానికి కలిసి పనిచేసే అవకాశం క్లిష్టంగా ఉంది’’ అని వివరించారు.
ఈ వైరస్ లైంగిక కార్యకలాపాలు ముఖ్యంగా స్వలింగ సంపర్కుల్లో ఎక్కువగా వ్యాప్తిచెందుతున్నట్టు నివేదికలు అందుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే.. మంకీపాక్స్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి వీర్యం లేదా యోని ద్రవాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందా..! ఒక వేళ అదే జరిగితే.. మంకీపాక్స్ ఎక్కువ కాలం ఉండగలదా..? అనే దానిపై ఇంకా స్పష్టత లేదని క్లూగే పేర్కొన్నారు.