కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆ ఇద్దరిని 24 గంటల్లో చంపేస్తామంటూ ముంబైలోని సీఆర్పీఎఫ్ ఆఫీస్‌కు మెయిల్ చర్చనీయాంశంగా మారింది .ఆత్మాహుతి దాడుల ద్వారా అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్‌ను హతమారుస్తామంటూ అందులో హెచ్చరించారు. 11మంది ఆత్మాహుతి దళ సభ్యులు ఇందుకు సిద్ధంగా ఉన్నారని మెయిల్‌లో చెప్పుకొచ్చారు. అలాగే ప్రార్థనా మందిరాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లోనూ దాడులు చేస్తామని మెయిల్‌లో బెదిరించారు.
మూడు రోజుల క్రితమే ఈ ఈ-మెయిల్ సీఆర్పీఎఫ్ ఆఫీస్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర నిఘా సంస్థలకు పంపినట్టు సీఆర్పీఎఫ్ అధికారులు చెప్పారు. ఈమెయిల్ ఎవరు పంపారు.. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుగుతోందని వారు వెల్లడించారు.