మన తెలుగు రాష్ట్రాలలో పరువు హత్యలు లేవు అనుకుంటునప్పుడు, ప్రణయ్ ని నడి రోడ్డు మీద నరికేసి అందరం తప్పు అని నిరూపించారు. ఇక ఆ హత్య తప్పే కాదని, అమృత తండ్రి మారుతి రావుకు కి మద్దత్తు ఇస్తూ ర్యాలీలు కూడా చేసి మనం ఎంత దారుణంగా బ్రతుకుతున్నామో చూపించారు.
ఈ దారుణం జరిగి ఏడాది గడిచిపోయింది! కానీ అమృతకు ఇంకా వేధింపులు ఆగడం లేదు. తాజాగా, ప్రణయ్‌ను మరచిపోవాలని అమృతకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఈ నెల 11న ప్రణయ్ వర్ధంతి రోజున డోర్‌కు ఎవరో అగంతకుడు లెటర్ అంటించి వెళ్లినట్లు తెలిసింది. ఇకనైనా ప్రణయ్‌ను మర్చిపోవాలని ఆ లేఖలో ఉన్నట్లు అమృత తెలిపింది. ఆమెను మరింత మానసిక వేదనకు గురిచేసేందుకు ఇలా చేస్తున్నారని ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రణయ్ హత్యకు గురైన సమయంలో అమృత గర్భవతి. కొన్నాళ్లకు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ అత్తింట్లో ఉంటున్న అమృత… బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా ఈ బెదిరింపు లేఖ గురించి పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు.