పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కు సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి తీవ్ర బెదిరింపులు ఎదురయ్యాయి. ‘‘స్వర్ణ దేవాలయం నుంచి బలగాలను ఉపసంహరించాలి. ఖలిస్థానీ అనుకూల శక్తులకు వ్యతిరేకంగా నడుచు కోవడం ఆపేయాలి. లేకపోతే మాజీ సీఎం బియాంత్ సింగ్ కు పట్టిన గతే మీకూ పడుతుంది. మా హెచ్చరికలను బేఖాతరు చేస్తే జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’’ అని ఎస్‌ఎఫ్జే చీఫ్ గుర్‌పత్వంత్ పన్నూ ఒక వీడియోలో బెదిరించారు.
ఖలిస్థానీ రెఫరెండంపై ఓటింగ్ తేదీని అకల్ తఖ్త్ వద్ద ప్రకటిస్తామని ఆయన తెలిపారు. 1995 ఆగస్టులో నాటి పంజాబ్ సీఎం బియాంత్ సింగ్ కారుబాంబు దాడిలో హత్యకు గురయ్యారు. కాగా.. సీఎం భగవంత్ ఆదివారం అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ప్రార్థనల తర్వాత అకల్ తఖ్త్ జతీందర్ వాసానికి వెళ్లి సమావేశమయ్యారు. కానీ.. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
మరోవైపు.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అతడి తండ్రి సలీమ్ ఖాన్ ని చంపేస్తామని కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. పంజాబ్ సింగర్ సిద్ధూకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని ఓ లేఖను పంపించారు. దీంతో అప్రమత్తమైన సల్మాన్ పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు.
అయితే.. సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ రోజూ ఉదయాన్నే వాకింగ్ కి వెళ్తారు. ఆ సమయంలో ఒక చోట బ్రేక్ తీసుకుంటారు. అక్కడే ఓ బెంచ్ మీద బెదిరింపు లేఖ దొరికింది. అందులో మూసావాలాను చంపినట్లే చంపేస్తామని రాసి ఉంది. బెదిరింపు లేఖను ఎవరు పెట్టి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా సల్మాన్ కు ఆయన తండ్రిక భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
కొన్ని రోజుల క్రితం పంజాబ్ సింగర్ సిద్ధూ మూసావాలా తన సొంత విలేజ్ లోనే హత్యకు గురయ్యారు. బిష్ణోయ్ గ్రూప్ సిద్ధూని చంపినట్లుగా వెల్లడించింది. ఇప్పుడు వారే సల్మాన్ ని కూడా బెదిరిస్తున్నట్లు కొందరు అనుమానిస్తున్నారు. గతంలో కూడా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకను దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్.. కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ ను చంపేస్తామని కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిష్ణోయ్ ముఠా.. సల్మాన్ హత్యకు ప్లాన్ చేశారని.. పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.