పశ్చిమ బెంగాల్ లోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా భగవాన్ పూర్ లో చర్చిపై శనివారం దాడి చేసిన ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చర్చిలోకి ప్రవేశించిన 8 మంది చైర్లు, టేబుళ్లను ధ్వంసం చేశారు. పాస్టర్ కారు అద్దాలను పగులగొట్టారు. 15 నిమిషాల పాటు విధ్వంసం సృష్టించారు. అనంతరం వెళ్తూ వెళ్తూ చర్చిపై బాంబులు విసిరి జై శ్రీరాం నినాదాలు చేసుకుంటూ పారిపోయారు. ఈ కేసులో ఫాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ అలోక్ ఘోష్ తెలిపారు. మిగతా వారు పరారీలో ఉన్నారని..వారంతా స్థానిక బీజేపీ, ఆరెస్సెస్ కు చెందిన వారని ఎస్పీ చెప్పారు.
గతంలో మధ్యప్రదేశ్, ఒడిషా, ఢిల్లీలో చర్చిలపై దాడులు జరిగిన సంఘటనలున్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ లో మాత్రం చర్చిపై దాడి జరగడం ఇదే మొదటిది. చర్చిపై దాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్థానిక బీజేపీ నాయకులు ప్రకటించారు.