హోలీ పండుగ పూట విషాదం నెలకొంది. కరీంనగర్ జిల్లా సదాశివపల్లి వద్ద తీగల వంతెన సమీపంలో మానేరు వాగుకు ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతులు వీరాంజనేయులు (12), సంతోష్ (14), అనిల్ (13) గా గుర్తించారు. వీరంతా హోసింగ్ బోర్డు కాలనీ వాసులుగా తెలుస్తోంది. మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన కొంతమంది కరీంనగర్ లో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం హోలీ పండుగ కావడంతో ముగ్గురు యువకులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్నానం కోసం అలుగునూరు మానేరు వాగుకు వచ్చారు. అనంతరం అందులోకి దిగగా.. రివర్ ఫ్రంట్ కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు మృతి చెందిన వారి కొడుకుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. అయితే తమ పిల్లల చావుకు రివర్ ఫ్రంట్ కాంట్రాక్టరే కారణమంటూ మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా ఈ ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి గంగుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం తరపున రూ. 3 లక్షలు, మంత్రి గంగుల తరపున రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.