మూడు రాజధానులకు శంకుస్థాపన చేసేందుకు ఆగస్టు 16న ఏపీ సర్కార్ ముహుర్తం నిర్ణయించినప్పటికీ దాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండటం, సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున వేసిన పిటిషన్ ఇంకా విచారణకు రాకపోవటంతో పాటు మరో ముఖ్య కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు రాజధానుల శంకుస్థాపన కోసం ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించాలని భావించారు. ఇందుకోసం స్వయంగా కలిసి ఇన్వైట్ చేయటానికి సమయం కూడా కోరారు. స్వయంగా హజరుకాలేక పోతే కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా హజరయ్యేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు. కానీ దీనికి ప్రధాని నుండి ఎలాంటి సమాధానం రాలేదు సరికదా సమయం ఇస్తారో ఇవ్వరో కూడా చెప్పలేదు. అందుకు కోర్టు కేసులు, ఉద్యమాలు కూడా కారణం కావొచ్చన్న అభిప్రాయం కూడా ఉండటంతో మూడు రాజధానుల ముహుర్తాన్ని దసరాకు మార్చినట్లు తెలుస్తోంది.
దసరాలోపు కేసులు ఓ కొలిక్కి వస్తాయని, కరోనా పరిస్థితులు కూడా కాస్త మెరుగుపడతాయని… అప్పుడు వైభవంగా మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.