ఏపీలో గంజాయికి అడ్డుకట్ట వేయడం ఖాకీలకు పెద్ద తలనొప్పిగా మారింది. దాడులు జరుపుతున్న కొద్దీ టన్నుల కొద్ది గంజాయి పట్టుబడుతూనే ఉంది. దీంతో వివిధ కేసులలో పట్టుబడిన సుమారు మూడు కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ గంజాయిని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఒకే దగ్గర వేసి దహనం చేశారు. గురువారం ఉదయం కంచికచెర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని పరిటాల గ్రామం, దొనబండ క్వారీ రోడ్ దగ్గర గంజాయిని దగ్ధం చేశారు.
అయితే ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచెర్ల, వన్ టౌన్, సత్యనారాయణపురం,అజిత్ సింగ్ నగర్, ఇబ్రహీంపట్నం, గుణదల ఇంకా పటమట పరిధిలోని పోలీస్ స్టేషన్ల లో గత కొంత కాలంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 18 కేసులలో సుమారు మూడు కోట్ల రూపాయల విలువ గల 7459 కేజీల గంజాయిని దహనం చేశామని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపట్టి గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్ది రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు.
గంజాయి నిషేధిత పదార్థం,గంజాయిని అక్రమ రవాణా చేసినా, వినియోగించిన చట్టపరంగా కఠిన చర్చలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలోని 24 పోలీసు స్టేషన్లలో ఇప్పటి వరకు 702 గంజాయి కేసులు నమోదయ్యాయి. ఇక తక్కువ సమయలో ఎక్కువ ఆదాయం పొందవచ్చని కొంత మంది ఈ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.