భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. పాత పాల్వంచ తూర్పు బజార్ లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కావడంతో కుమార్తె సహా దంపతులు సజీవ దహనమయ్యారు. మండిగ నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు. పిల్లలతో కలిసి వారు సంతోషంగా గడుపుతున్నారు. విధి వెక్కిరించిందో ఏమో కానీ… ఒక్క సారిగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సోమవారం తెల్లవారుజామున ఇంట్లోని గ్యాస్ లీక్ అయింది. దీంతో పెద్దగా మంటలు చెలరేగాయి. అందరూ నిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని తొందరగా గ్రహించలేకపోయారు. మంటల్లో చిక్కుకొని చిన్నారి సహా దంపతులు సజీవ దహనమయ్యారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు మంటల్లో కాలి గాయాలపాలైన చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి 80% కాలిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.