కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. ఇప్పటి వరకు కేవలం విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి, లేదా వారి బంధువులకు సోకింది. ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులు-కుటుంబ సభ్యులకు పాజిటివ్ వస్తుండగా… ఇప్పుడు కరోనా వైరస్ వ్యక్తితో ఇతరులకు, వారి నుండి మరోకరికి కమ్యూనిటీ వ్యాప్తి కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి తగిన సదుపాయాలు కల్పించటంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, దాంతో ఇప్పటి వరకు 50మంది వైద్యులు, వైద్య సిబ్బందికి దేశవ్యాప్తంగా కరోనా వచ్చిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తుండగా ముంబైలో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది.
ముంబై కార్పోరేషన్ పరిధిలోని వోక్ హార్డ్ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు, 26మంది నర్సులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి, వ్యాధి ఇతర రోగులకు, వైద్య సిబ్బందికి సోకకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అయితే, కరోనా ఆ ప్రైవేటు వైద్య సిబ్బందికి ఎలా వచ్చిందని ఆరా తీయగా… కరోనా వైరస్ ఉన్న ఓ 70 ఏళ్ల వ్యక్తి మార్చి 27న హార్ట్ ఎటాక్ తో ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో జాయిన్ అయ్యాడు. దీంతో ఆయనకు తొలుత వైద్య సహాయం చేసిన ఇద్దరు నర్సులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో వ్యాధి క్రమంగా 26 మంది నర్సులకు, 3 వైద్యులకు సోకినట్లు తేలింది. వ్యాధి ఇంతలా వ్యాప్తి చెందటంలో ఆసుపత్రి నిర్వాకం కూడా ఉందని… మొదట్లోనే వ్యాధి లక్షణాలు ఉన్న నర్సులను క్వారెంటైన్ చేయకుండా డ్యూటీలు వేయటంతో వైరస్ వ్యాపించిందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీన్ని ఆసుపత్రి వర్గాలు మాత్రం ఖండిస్తున్నాయి.