అప్పటి వరకూ కటిక పేదరికంతో అల్లాడిన వారు ఉన్నట్టుండి కోటీశ్వరులైతే… ఎలా ఉంటుంది. అదృష్టదేవత ఎప్పుడు ఎలా పలకరిస్తోందో ఎవరికీ తెలియదు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన ఓ కుటుంబం కొద్ది రోజుల్లో నడి రోడ్డున పడుతోంది అనగా… ఒక్కసారిగా వారిని లక్కు వరించింది. అంతే ఒక్క దెబ్బతో ఇబ్బందులు అన్ని తీరిపోయాయి.
తీసుకున్న రుణం చెల్లించకుంటే రెండు రోజుల్లో ఉన్న ఇంటిని కూడా జప్తు చేస్తామని బ్యాంకు నోటీసులు కూడా పంపింది. దీంతో అతనికి ఏం చేయాలో తెలియలేదు. అదే జరిగితే కుటుంబం వీధిన పడుతుందని ఆందోళన చెందాడు. అయితే, నోటీసు వచ్చిన మూడు గంటల తర్వాత అద్భుతమే జరిగింది.
ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా నీకు లాటరీ తగిలింది అంటూ శుభవార్త చెవిలో వేశాడు. ఇంక అంతే.. అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయి ఎగిరి గంతేశాడు. దీంతో అతడి జీవితమే మలుపు తిరిగింది. సినిమాను తలపించిన ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.కేరళలోని కొల్లాం జిల్లా మ్యాంగనపల్లిలోని ఎడవస్సేరీకి చెందిన పోఖున్జు బ్యాంకు నోటీసు అందుకున్న మూడు గంటల్లోనే రూ.70 లక్షల లాటరీ తగిలింది.
మధ్య తరగతి కుటుంబానికి చెందిన పోఖున్జుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కష్టపడి పనిచేస్తూ, స్కూటర్‌పై చేపలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, ఆర్థిక కష్టాలు వెంటాడటంతో తన ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి స్థానిక కార్పొరేషన్ బ్యాంకులో రూ.9 లక్షలు రుణం తీసుకున్నాడు.
అయితే, సకాలంలో రుణం చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు పంపారు. వారు పంపిన నోటీసు బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందింది.వడ్డీతో సహా మొత్తం రూ.12 లక్షలు చెల్లించాలని, లేకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని నోటీసులో హెచ్చరించారు. దీంతో ఆందోళనకు గురయిన పోఖున్జు.. భార్యాబిడ్డలు రోడ్డునపడతారని తీవ్రంగా కలత చెందాడు.
తాను ఒకటి తలస్తే దైవం ఒకటి తలచినట్టు అదేరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రూ.70 లక్షల లాటరీ గెలుచుకున్నట్లు వార్త అందింది. దీంతో అతడి ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. లాటరీ సొమ్ముతో తన కష్టాలన్నీ తీరిపోతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
వాస్తవానికి పోఖున్జుకి లాటరీపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అతడి తండ్రి యూసఫ్‌కు మాత్రం లాటరీ టికెట్లు పిచ్చి ఎక్కువ. కానీ, సరదాగా గోపాల పిళ్లై అనే వ్యక్తి దగ్గర ఇటీవల టికెట్ కొని ఒక్కసారిగా లక్షాధికారి అయిపోయాడు. అక్షయ లాటరీలో మొదటి బహుమతిని గెలుచుకున్నాడు.