బిహార్లో దారుణం జరిగింది. గయా జిల్లాలో ఫిరంగి గుండు ఒకటి ఓ ఇంట్లోకి దూసుకు వచ్చింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గులార్ బెడ్ గ్రామంలో సైనిక విన్యాసాల కోసం రిహాల్స్ చేస్తున్నారు. అందులో ఉపయోగించిన ఫిరంగిలోని ఓ మందు గుండు ప్రమాదవశాత్తు గ్రామంలోని గోవింద్ మాంఝీ అనే వ్యక్తి ఇంటిపై పడింది. ఆ సమయంలో ఇంట్లో హోలీ వేడుకలు జరుపుకుంటున్న ముగ్గురు మరణించారు.
అదే సమయంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో గోవింద్, అతని కుమార్తె కంచన్తో పాటు అల్లుడు సూరజ్ కుమార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని అధికారులపై గ్రామస్తులు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు జరుగుతోందని గయా ఎస్ఎస్పీ ఆశీష్ భారతీ వెల్లడించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.