మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వచ్చి ఎవరి ప్రాణాలు హరిస్తుందో ఎవరికి తెలియదు. వరంగల్ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదంలో మూడు తరాల బంధం జలసమాధి అయింది. జిల్లాలోని నర్సంపేట మండలం చిన్నగురిజాల చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. చిన్న గురిజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి (65) అనే రైతు తన కొడుకు నాగరాజు (34), మనవడు దీపక్ (12) తో కలిసి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. దీపక్ సరదాగా ఆడుకుంటూ చెరువులో స్నానానికి దిగాడు. లోతు గమనించకుండా లోనికి వెళ్లిన దీపక్ చెరువులో మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు తాత కృష్ణమూర్తి చెరువులోకి దిగాడు.
దురదృష్టావశాత్తు కృష్ణమూర్తి కూడా అందులోనే మునిగిపోయాడు. గమనించిన బాలుడి తండ్రి నాగరాజు.. వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. చివరకు ముగ్గురు ఆ చెరువులో మునిగి ప్రాణాలను కోల్పోయారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు క్షణాల్లోనే జలసమాధి కావడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విశాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటనతో గ్రామం ఊరంతా ఒక్క సారీగా ఉలిక్కిపడింది.
————————————————————————