తెలంగాణలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు సమయం ఆసన్నమైంది. శనివారం గవర్నర్ తమిళిసై అధికారికంగా మూడు పేర్లు ప్రకటించనుండగా… శుక్రవారం కేబినెట్ మీట్ లో ఆమోదముద్రవేశారు.
ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం… మాజీ మంత్రి సారయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ నుండి పార్టీలో చేరిక సమయంలో కేసీఆర్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. పైగా ఆయన బలమైన బీసీ సామాజికవర్గం నేత కావటంతో పాటు రాబోయే వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ప్రభావం ఉంటుందని లెక్కలు గట్టినట్లు తెలుస్తోంది.
ఇక కవి, గాయకుడు గోరేటి వెంకన్న పేరు కూడా ఫైనల్ అయ్యింది. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడిన సాహిత్యానికి గుర్తింపుగా వెంకన్న పేరును ప్రతిపాదించబోతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ గుర్తిచేయటంతో పాటు ఆయన పాట ప్రభావం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై కూడా ఉంటుందని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.
మూడో ఎమ్మెల్సీ స్థానాన్ని వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు మంత్రివర్గం గవర్నర్ కు సిఫారసు చేసింది.