టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతున్నా.. కొంతమంది మూఢనమ్మకాలను మాత్రం వదలడం లేదు. దెయ్యాలు వదిలిస్తామని, పిల్లలు పుట్టేలా చేస్తామని, మరో పక్క నాటు వైద్యం పేరుతో ఎంతో మంది బలవుతున్నారు. తాజాగా ఈ మూఢనమ్మకానికి మూడు నెలల చిన్నారి బలి అయ్యింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని గిరిజన ప్రాంతమైన షాదోల్ జిల్లాలోని సింగ్ పుర్ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి నిమోనియా బారినపడింది. దీంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. అయితే పాప తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లకుండా.. స్థానికంగా ఉన్న మంత్రగాళ్లకు చూపించారు. ఈ క్రమంలో వారు పాప పొట్ట చుట్టూ ఇనుప రాడ్డుతో కాల్చి 51 సార్లు వాతలు పెట్టారు.
అయినప్పటికీ చిన్నారి ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో వారు పసికందును స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారికి వ్యాధి సోకి అప్పటికే 15 రోజులు గడిచిపోవడంతో జరగరాని నష్టం జరిగిపోయింది. నిమోనియాకు సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఇన్ ఫెక్షన్ ఎక్కువై చిన్నారి మృతి చెందింది.
పాపకు తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. శుక్రవారం శిశు, సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే వారు చర్యలు చేపట్టారు. చిన్నారిని ఖననం చేసిన చోటుకెళ్లి.. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.